Sakshi News home page

రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి

Published Thu, Dec 20 2018 2:10 AM

Decision on reservation   States should be given - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని కేంద్రానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు విన్నవించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రి థావర్‌ చంద్‌గెహ్లాట్‌ను వారు కలిశా రు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎన్‌సీబీసీ చైర్మన్‌ను నియమించాలని విన్నవించారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ‘ఏక్‌ దేశ్‌–ఏక్‌ నీతి ఉండాలన్నదే మా అధినేత నినాదం.

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. అయినా కేంద్రం ఇప్పటివరకు ఓబీసీలకు సంబంధించిన మంత్రిత్వ శాఖపై నిర్ణయం తీసుకోలేదు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో విభిన్న రకాలుగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎన్‌సీబీసీ ఏర్పాటు చేసి 9 నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చైర్మన్‌ను నియమించలేదు..’ అని టీఆర్‌ఎస్‌ ఎంపీలు మీడియాకు వివరించారు.
 
ఐఐఎం ఏర్పాటుపై వినతి
తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు టీఆర్‌ఎస్‌ ఎంపీలు విన్నవించారు. బుధవారం సాయంత్రం వారు మంత్రిని కలిశారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, కొత్త జిల్లాల్లో జిల్లాకో నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒత్తిడి పెంచుతున్నాం. నాలుగున్నరేళ్లుగా విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్రమంత్రిని అనేకసార్లు కలిశాం.

అయినా స్పందించడం లేదు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్‌ సైతం కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం జరిగిన సమావేశంలో మరోసారి గతంలో ఇచ్చిన హామీలను గుర్తుచేశాం..’అని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు. కేంద్ర మంత్రులను కలసిన వారిలో ఎంపీలు కె.కవిత, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, నగేశ్, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, ప్రకాశ్‌ ముదిరాజ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్‌.వేణుగోపాలాచారి ఉన్నారు.

ఆ గుర్తులు కేటాయించొద్దు
ఎన్నికల చిహ్నంగా ట్రక్కు, కెమెరా, ఇస్త్రీపెట్టె, హ్యాట్‌ గుర్తులను కేటాయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. బుధవారం టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి, ఎంపీ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్‌.వేణుగోపాలాచారి ప్రధాన కమిషనర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు ట్రక్కు, కెమెరా, ఇస్త్రీపెట్టె, హ్యాట్‌ తదితర గుర్తులు కేటాయించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టం వాటిల్లిందని నివేదించారు. ఈ చిహ్నాలు టీఆర్‌ఎస్‌ గుర్తు కారును పోలి ఉండటంతో తమకు రావాల్సిన ఓట్లు ఆయా గుర్తులకు పోలయ్యాయని వివరించారు. ఎన్నికలకు ముందే ఈ అంశంపై సీఈసీకి నివేదించామని గుర్తుచేశారు. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కారును పోలిన గుర్తులను కేటాయించవద్దని కోరారు. 

Advertisement

What’s your opinion

Advertisement